
ఈ సైట్ ఎందుకు?
ఇన్సూరెన్స్ అవసరం లేని కుటుంబం దాదాపు ఉండదు. కూలీ పని చేసేవాళ్ళైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యవసాయం చేసేవాళ్ళైనా, చిన్న షాపు నడిపేవాళ్ళైనా, అనుకోని జబ్బు, ప్రమాదం ఎవరికైనా రావొచ్చు. అలాంటప్పుడు కుటుంబం నిలబడటానికి ఇన్సూరెన్స్ ఒక ఆధారం.
కానీ ఒక్కసారి మన చుట్టూ చూడండి. ఇన్సూరెన్స్ గురించి బాగా తెలిసి, అర్థం చేసుకుని పాలసీ తీసుకునేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువగా కాస్త చదువుకున్నవాళ్ళే తీసుకుంటున్నారు. మిగతావాళ్ళకు అవసరం లేక కాదు. ఎవరూ సరిగ్గా, అర్థమయ్యేలా చెప్పకపోవడమే అసలు కారణం.
ఇన్సూరెన్స్ గురించి చాలామందికి మొదట తెలిసేది అమ్మేవాళ్ళ ద్వారానే. నిజాయితీగా సహాయం చేసే ఏజెంట్లూ ఉన్నారు. కానీ ఎక్కువసార్లు దృష్టంతా ఆ పాలసీ అమ్మడం మీదే ఉంటుంది. కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. దాంతో నమ్మకం రావడం కంటే భయమే పెరుగుతుంది. “నాకు ఇది నిజంగా అవసరమా? నన్ను మోసం చేస్తున్నారా?” అనే అనుమానం మిగిలిపోతుంది.
పోనీ మనమే తెలుసుకుందాం అనుకుంటే అదీ అంత సులభం కాదు. మార్కెట్‌లో వందల కొద్దీ పాలసీలు ఉన్నాయి. అవి కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొత్తవి వస్తాయి, పాతవి ఆగిపోతాయి, నియమాలు మారతాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక సబ్జెక్ట్ మొత్తం కూర్చుని నేర్చుకున్నట్టే ఉంటుంది. పైగా ప్రీమియం, సమ్ అష్యూర్డ్, వెయిటింగ్ పీరియడ్ లాంటి పదాలు అర్థం కావు. రోజువారీ పనుల మధ్య అంత ఓపిక, సమయం ఎవరికి ఉంటాయి? అందుకే చాలామంది “తర్వాత చూద్దాంలే” అని వదిలేస్తారు. లేదా అర్థం కాకుండానే సంతకం పెట్టేస్తారు.
ఈ ఇబ్బంది తీర్చడానికే insurancetalks.in మొదలుపెట్టాం.
మేము ఏం చేస్తాం?
మీరు ఇన్సూరెన్స్ గురించి ఒక సబ్జెక్ట్‌లా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ కష్టమైన పని మేము చేస్తాం. IRDAI, ప్రభుత్వ పథకాల వెబ్‌సైట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారిక డాక్యుమెంట్లు చదివి, మీకు కావాల్సిన విషయాన్ని మన తెలుగులో, సులభంగా, ఉదాహరణలతో చెబుతాం. ప్రతి విషయానికీ ఎక్కడి నుంచి తీసుకున్నామో మూలం కూడా చూపిస్తాం. అలాగే:
- ఇన్సూరెన్స్ గురించి జనాల్లో ఉన్న అపోహలు, వాటి వెనుక ఉన్న నిజం చెబుతాం.
- కష్టమైన పదాలను మన మాటల్లో వివరిస్తాం.
- ఏ పాలసీ చూసినా మీరు ఏమేమి చెక్ చేయాలో చెబుతాం. అప్పుడు ఎవరి మాటల మీదా ఆధారపడకుండా మీరే అర్థం చేసుకోగలరు.
మేము చేయనిది
మా ఉద్దేశ్యం మీతో ఇన్సూరెన్స్ కట్టించడం కాదు. పాలసీ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏది తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. మేము దాంట్లో జోక్యం చేసుకోము.
- మేము ఏ పాలసీనీ అమ్మము, సిఫార్సు కూడా చేయము.
- ఏ కంపెనీ దగ్గర నుంచీ డబ్బు, కమిషన్ తీసుకోము.
- మీ ఫోన్ నంబర్ అడగము. ఇక్కడి నుంచి మీకు ఎవరూ కాల్ చేయరు.
ప్రశాంతంగా చదవండి, అర్థం చేసుకోండి, మీ కుటుంబానికి ఏది సరిపోతుందో మీరే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయానికి కావాల్సిన నిజమైన సమాచారం ఇవ్వడమే మా పని.